Mushroom Fried Rice : మనం పుట్టగొడుగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప్రస్తుత కాలంలో ఇవి మనకు అన్ని వేళల్లా లభిస్తున్నాయి. పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. పుట్టగొడుగులతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో రుచిగా, సులభంగా చేసుకోదగిన వంటకాల్లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, మొదటి చేసే వారు, వంటరాని వారు ఎవరైనా చేయవచ్చు. ఎటువంటి సాస్ లను ఉపయోగించకుండా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ను పెళ్లిళ్లల్లో చేసినట్టుగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పుట్టగొడుగులు – 200 గ్రా., క్యాప్సికం సన్నని తరుగు – పావు కప్పు, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, బటర్ – 3 టీ స్పూన్స్, అన్నం – ఒకటిన్నర కప్పు బాస్మతీ బియ్యంతో వండినంత, మిరియాల పొడి – ఒకటింపావు టీ స్పూన్.
మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని పెద్ద మంటపై వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత పుట్టగొడుగు ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. వీటిని పెద్ద మంటపై 80 శాతం వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత బటర్, మరో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత అన్నం, మిరియాల పొడి, మరో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అన్నం అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా మష్రూమ్ తో ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.