Meal Maker Pakoda : మనం మీల్ మేకర్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేకర్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మీల్ మేకర్ పకోడా కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మీల్ మేకర్ లతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మీల్ మేకర్ లతో రుచికరమైన పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 2 కప్పులు, పసుపు -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,ఉల్లిపాయ – చిన్నది ఒకటి, శనగపిండి – 4 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మీల్ మేకర్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక మీల్ మేకర్ వేసి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని వడకట్టి చల్లటి నీటిని పోసి పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత వీటిలో ఉండే నీటిని పూర్తిగా పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నీటిని పోసి కలపకూడదు. ఇలా మసాలాలన్నీ మీల్ మేకర్ లకు పట్టించిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపైఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పకోడా తయారవుతుంది. వీటిపైచాట్ మసాలా చల్లుకుని నిమ్మరసంతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు మీల్ మేకర్ లతో పకోడాలను తయారు చేసుకుని తినవచ్చు.