Mealmaker Manchuria : మనం మీల్ మేకర్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేకర్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం ఎక్కువగా కూరలను తయారు చేస్తూ ఉంటాము. కేవలం కూరలే కాకుండా మీల్ మేకర్ తో మంచురియాను కూడా తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్ మంచురియా మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. ఈ మంచురియాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ మీల్ మేకర్ మంచురియాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 100 గ్రా., నీళ్లు – ఒక లీటర్, ఉప్పు -తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
టాసింగ్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – 2, క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, రెడ్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, టమాట సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్.
మీల్ మేకర్ మంచురియా తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను నీటిలో వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ మీల్ మేకర్ లను గట్టిగా పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని పెద్ద మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టాసింగ్ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
తరువాత క్యాప్సికం, ఉల్లిపాయ క్యూబ్స్ వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత టమాట సాస్, ఉప్పు, వెనిగర్ వేసి కలపాలి. తరువాత కార్న్ ఫ్లోర్ ను నీటిలో కలిపి వేసుకోవాలి. సాసెస్ అన్ని చిక్కబడిన తరువాత వేయించిన మీల్ మేకర్ లను వేసి పెద్ద మంటపై ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మంచురియా తయారవుతుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే మీల్ మేకర్ లతో మంచురియాను తయారు చేసుకుని తినవచ్చు.