Menthikura Shanagapappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో మెంతికూర కూడా ఒకటి. మెంతికూర వల్ల మనకు కలిగే మేలు అంతా ఇంతా కాదు. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మెంతికూరతో శనగపప్పును కలిపి మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూర శనగపప్పును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలన ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర శనగపప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతికూర – 3 కట్టలు, శనగపప్పు – 2 టీ గ్లాసులు, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్.
మెంతికూర శనగపప్పు తయారీ విధానం..
ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును నీళ్లు లేకుండా వడకట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు మెంతికూరను వేసి కలపాలి. మెంతికూర దగ్గరపడి చక్కగా వేగిన తరువాత ఇందులో ఉడికించిన శనగపప్పు వేసి కలపాలి.
తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. ఈ కూరను మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర శనగపప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మెంతికూరను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మెంతికూరతో కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.