Minapa Vadalu : మనం ఆహారంలో భాగంగా మినప పప్పును కూడా తీసుకుంటూ ఉంటాం. ఇతర పప్పు దినుసుల లాగా మినప పప్పు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మినప పప్పుతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మినప పప్పుతో చేసే వాటిల్లో వడలు కూడా ఒకటి. మినప వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ ఇవి బయట దొరికే విధంగా కరకరలాడుతూ ఉండవు. వడలను బయట దొరికే విధంగా కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినప వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒకటిన్నర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన అల్లం – కొద్దిగా, చిన్నగా తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మినప వడల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినప పప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపప్పును జార్ లో కానీ, గ్రైండర్ లో కానీ వేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మెత్తని పిండిలా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. పిండిని ఇలా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల వడలు కరకరలాడుతూ ఉంటాయి. ఒక గంట తరువాత పిండిని తీసుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత చేతికి కొద్దిగా నీటితో తడి చేసుకుంటూ కావల్సిన పరమాణంలో పిండిని తీసుకుని వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసి రెండు దిక్కులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. దీంతో రుచికరమైన మినప వడలు తయారవుతాయి. ఈ వడలను పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. మినప పప్పుతో తరచూ చేసే దోశ, ఇడ్లీ, ఊతప్పం వంటి వాటికి బదులుగా అప్పుడప్పుడూ ఇలా వడలను కూడా తయారు చేసుకుని ఉదయం అల్పాహారంలో భాగంగా తినవచ్చు. దీంతో ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.