Vegetable Upma : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో ఉప్మా కూడా ఒకటి. దీనిని తయారు చేయడం చాలా సులభమే. కానీ దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ ఉప్మాను అందరూ ఇష్టపడేలా చాలా రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఉప్మాను రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటెబుల్ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), తరిగిన పచ్చి మిర్చి – 3 లేదా రుచికి తగినన్ని, చిన్నగా తరిగిన బంగాళాదుంప – 1 (పెద్దది), చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, చిన్నగా తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెబ్బలు, నీళ్లు – మూడున్నర కప్పులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నెయ్యి – 2 టీ స్పూన్స్, వేయించిన జీడిపప్పు – కొద్దిగా.
వెజిటెబుల్ ఉప్మా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఉప్మారవ్వను వేసి చిన్న మంటపై కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి కాగిన తరువాత శనగ పప్పు, ఆవాలు, మినప పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన బంగాళాదుంప, క్యారెట్ వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత క్యాప్సికం, టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ముక్కలు అన్నీ ఉడికే వరకు ఉంచాలి. ముక్కలు ఉడికిన తరువాత మూత తీసి నీళ్లు పోసి మరిగించుకోవాలి.
నీళ్లు మరిగిన తరువాత వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి చివరగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పును, నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటెబుల్ ఉప్మా తయారవుతుంది. దీనిని కారం పొడి, పల్లీ చట్నీ, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇలా వెజిటెబుల్ ఉప్మాను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన ఉప్మాను అందరూ ఇష్టంగా తింటారు.