Mirchi Bajji Recipe : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో మిర్చి బజ్జీలు కూడా ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మిర్చి బజ్జీలను చాలా మంది ఇష్టంగా తింటారు. బయట బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ మిర్చి బజ్జీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లో ఈ మిర్చి బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ముప్పావు కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, వంటసోడా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, బజ్జి మిర్చి – 10 లేదా 12, చిక్కటి చింతపండు గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జల్లెడను ఉంచి అందులో శనగపిండి, బియ్యం పిండి వేసి జల్లించుకోవాలి. తరువాత ఉప్పు, వంటసోడా, కారం వేసి కలుపుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశ పిండి కంటే కొద్దిగా పలుచగా పిండిని కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో చింతపండు గుజ్జును, జీలకర్రను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జి మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని మధ్యలోకి చీరి మధ్యలో ఉన్న గింజలను తీసివేయాలి. తరువాత ఈ మిర్చిలో చింతపండు మిశ్రమాన్ని ఉంచి స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక చీరిన దగ్గర వేలు ఉంచి మిర్చిని పట్టుకుని శనగపిండి మిశ్రమంలో ముంచాలి. మిర్చికి పిండిని బాగా పట్టించి నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని ముందుగా 30 సెకన్ల పాటు చిన్న మంటపై కాల్చుకున్న తరువాత మంటను మధ్యస్థంగా చేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జి తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మిర్చి బజ్జీలు చాలా సేపటి వరకు కరకరలాడుతూ ఉంటాయి. అప్పుడప్పుడూ సాయంత్రం సమయాల్లో ఈ విధంగా మిర్చి బజ్జీలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.