Mixed Veg Lollipop : మిక్స్డ్ వెజ్ లాలిపాప్స్.. ఇవి మనకు పెళ్లిళ్లల్లో వడిస్తూ ఉంటారు. అలాగే రెస్టారెంట్ లలో కూడా ఇవి మనకు లభిస్తూ ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వెజ్ లాలిపాప్స్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పార్టీలు జరిగినప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు, వీకెండ్స్ లో స్పెషల్ గా తయారు చేసి తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ మిక్స్డ్ వెజ్ లాలిపాప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ వెజ్ లాలిపాప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లితరుగు – 3 టేబుల్ స్పూన్స్, క్యాబేజి తురుము – అర కప్పు, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 6, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప ముద్ద – ముప్పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క, మైదాపిండి – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు.
మిక్స్డ్ వెజ్ లాలిపాప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవివేగిన తరువాత క్యారెట్, క్యాబేజి, ఫ్రెంచ్ బీన్స్ వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, చిల్లీ ప్లేక్స్ వేసి కలపాలి. తరువాత మెత్తగా చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయంత ఉండలుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఫ్రిజ్ లో ఉంచిన ఉండలను బయటకు తీసి వాటిని ముందుగా మైదాపిండి మిశ్రమంలో ముంచాలి. తరువాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. తరువాత లాలిపాప్ స్టిక్స్ ను తీసుకుని గుచ్చి ఊడిపోకుండా చక్కగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లాలిపాప్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వెజ్ లాలిపాప్స్ తయారవుతాయి. వీటిని వేడి వేడిగా టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.