Mulakkada Karampulusu : మనం మునక్కాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మునక్కాయలతో సాంబార్, కూర వంటి వాటితో పాటు కారం పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారంగా ఉండే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కారం పులుసును తయారు చేసుకోవడం చాలా సులభం. మునక్కాయలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ మునక్కాయ కారం పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాడ కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
మునక్కాయలు – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాట – 1, తరిగిన ఉల్లిపాయ – 1, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు- పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మునక్కాడ కారం పులుసు తయారీ విధానం..
ముందుగా మునక్కాయలపై ఉండే పొట్టును తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మునక్కాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత నువ్వులు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే మసాలా దినుసులు, వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో మరో2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. మసాలాల ముక్కలకు పట్టేలా కలుపుకున్న తరువాత తగినన్ని నీళ్లు, చింతపండు పులుసు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మునక్కాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ కారం పులుసు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మునక్కాయ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.