Munakkaya Pulusu : మునక్కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తం శుద్ది అవుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మునక్కాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎక్ఉవగా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునక్కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. మునక్కాయలు ఉంటే చాలు ఈ పులుసును 20 నిమిషాల్లో చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో రుచిగా పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, తరిగిన మునక్కాయలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్.
మునక్కాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, మునక్కాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడే వరకు వేయించిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. మునక్కాయ ముక్కలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ పులుసు తయారవుతుంది. మునక్కాయలతో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా రుచిగా పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు. అన్నంతో ఈ పులుసును తింటే చాలా రుచిగా ఉంటుంది.