Muntha Masala : సాయంత్రం సమయంలో స్నాక్స్‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే రకరకాల స్నాక్స్‌ను తింటుంటారు. నూనె పదార్థాలు, బేకరీ ఆహారాలు.. ఇలా అనేక ఫుడ్స్ మనకు స్నాక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ బదులుగా మనం ఇంట్లోనే ఎంతో సులభంగా ముంత మసాలాను చేసుకోవచ్చు. దీని గురించి చాలా మంది వినే ఉంటారు. ముంత మసాలాను చేయడం చాలా సులభం. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంత మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
మిర్చి బజ్జి – 1, మరమరాలు – 1 పెద్ద కప్పు, కారం – అర టేబుల్ స్పూన్, ఉప్పు – అర టేబుల్ స్పూన్, పసుపు – చిటికెడు, చాట్ మసాలా – ముప్పావు టేబుల్ స్పూన్, జీలకర్ర – పావు టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు – అర టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు – 3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), వేయించిన పల్లీలు – 3 టేబుల్ స్పూన్లు, వేయించిన కార్న్ ఫ్లేక్స్ – 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర ఆకులు – 2 టేబుల్ స్పూన్లు, టమాటాలు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్.
ముంత మసాలాను తయారు చేసే విధానం..
ముందుగా మిర్చి బజ్జి, ఉల్లిపాయలు, టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే అవసరం అనుకుంటే క్యారెట్ తురుము, కీర దోస తురుమును కూడా వేసుకోవచ్చు. తరువాత అన్ని పదార్థాలను కలిపేందుకు వీలుగా ఉండేలా ఒక పెద్ద పాత్రను తీసుకోవాలి. అందులో మరమరాలు, ఉల్లిపాయలు, టమాటాలు వేయాలి. ఇంకా ఏమైనా ఇతర కూరగాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అనంతరం కారం, పసుపు, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేయాలి. తరువాత పల్లీలు, కార్న్ ఫ్లేక్స్ వేయాలి. అనంతరం నిమ్మరసం పిండాలి. అన్నింటినీ కలిసేలా బాగా కలియబెట్టాలి.
బాగా కలిసిన తరువాత రుచి చూసి అవసరం అనుకుంటే ఇంకాస్త ఉప్పు, కారం, నిమ్మరసం వేసి కలుపుకోవచ్చు. దీంతో ముంత మసాలా రెడీ అవుతుంది. అయితే ఇది ఎక్కువ సేపు ఉంటే మెత్తగా అవుతుంది. కనుక కలిపిన వెంటనే తినేయాలి. ఇలా చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయంలో దీన్ని చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.