Mushroom Pulao : మనం పుట్ట గొడుగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పుట్టగొడుగులను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పుట్ట గొడుగులతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పుట్ట గొడుగులతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మష్రూమ్ పులావ్ కూడా ఒకటి. పుట్ట గొడుగులతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేయవచ్చు. పుట్టగొడుగులతో రుచిగా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – చిన్న ముక్క, లవంగాలు – 5, యాలకులు – 4, మిరియాలు – అర టీ స్పూన్, సాజీరా – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ -1, రెండు ముక్కలుగా తరిగిన పుట్ట గొడుగులు – 200 గ్రా., గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – అర కట్ట, తరిగిన పుదీనా – అర కట్ట.
మష్రూమ్ పులావ్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత పుట్ట గొడుగు ముక్కలు, ఉప్పు, గరం మసాలా, అల్లం పేస్ట్ వేసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత బియ్యం, కొత్తిమీర, పుదీనా వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత కుక్కర్ పై మూతను ఉంచి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ పులావ్ తయారవుతుంది. దీనిని మిర్చి కా సాలన్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మష్రూమ్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పులావ్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. లంచ్ బాక్స్ లల్లోకి కూడా ఈ పులావ్ చాలా చక్కగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.