Mysore Bonda : మైసూర్ బోండాలు.. వీటిని మనం అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ బోండాలను తయారు చేయడానికి మనం ఎక్కువగా మైదా పిండిని వాడుతూ ఉంటాము. కేవలం మైదా పిండే కాకుండా మనం గోధుమ పిండితో కూడా రుచికరమైన బోండాలను తయారు చేసుకోవచ్చు. ఈ బోండాలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అలాగే తక్కువ సమయంలోనే వీటిని తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో రుచికరంగా బోండాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు -తగినంత, వంటసోడా – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, గోధుమపిండి – 2 కప్పులు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
మైసూర్ బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి మజ్జిగలాగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, వంటసోడా, జీలకర్ర వేసి కలుపుకోవాలి. తరువాత గోధుమపిండి వేసి కలుపుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. పిండి నానిన తరువాత మరోసారి పిండిని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని బోండాలుగా చేసుకోవాలి. బోండాలు మరీ పెద్దగా కాకుండా చూసుకోవాలి.
నూనెకు తగినన్ని బోండాలు వేసుకున్న తరువాత వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బోండాలు తయారవుతాయి. ఈ బోండాల్లో మనం అల్లం తరుగు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బోండాలను చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీకెండ్స్ లో ఇలా స్పెషల్ గా గోధుమ పిండితో బోండాలను తయారు చేసుకుని తయారు చేసుకుని తినవచ్చు.