Mysore Bonda : మనం ఉదయం పూట తయారు చేసే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ బోండాలను తయారు చేయడానికి మనం మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. మైదా పిండిని అతిగా తీసుకోవడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదా పిండిని ఉపయోగించకుండా ఈ మైసూర్ బోండాలను రుచిగా ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మైసూర్ బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తరువాత మూత ఉంచి 2 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా పులియబెట్టిన తరువాత పిండిని మరో 2 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇప్పుడు లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుంటూ తగిన మోతాదులో పిండిని తీసుకుంటూ బోండాలు వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై తిప్పుతూ అన్ని వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బోండాలను టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ బోండాలు తయారవుతాయి. వీటిని కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో ఇలా బోండాలను చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.