Naga Chaitanya : గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుమంత్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన పలు చిత్రాల్లో నటించారు. అయితే ఏవీ ఆయనకు మంచి విజయాన్ని అందించలేకపోయాయి. అలాగే తాజాగా మళ్లీ మొదలైంది అనే మూవీతో పలకరించారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో నేరుగా విడుదలైంది. అయితే ఈ మూవీ కూడా హిట్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే సుమంత్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడారు. నాగచైతన్య, సమంతల విడాకులపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సమంత, నాగచైతన్యల విడాకులు చాలా దురదృష్టకరమని సుమంత్ అన్నారు. ఫ్యామిలీ అంతా వారి విడాకుల కారణంగా అప్సెట్ అయ్యారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. విడాకుల కారణంగా చైతన్య తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని.. ఆ బాధ నుంచి బయట పడేందుకు చైతూకు సమయం ఇవ్వాలని అన్నారు.
ఇక విడాకుల వల్ల ఇద్దరికీ బాధ కలుగుతుందని.. అయితే ఇది వారి మంచికే అని సుమంత్ అన్నారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వారి భవిష్యత్తు బాగుండాలనే తాను కోరుకుంటున్నానని తెలిపారు. విడాకులు తీసుకోవడం పెద్ద నేరమేమీ కాదని, దాని నుంచి వీలైనంత త్వరగా బయట పడి జీవితాన్ని కొనసాగించాలని అన్నారు. కాగా సుమంత్ కూడా గతంలో నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని తరువాత ఆమెకు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. అయితే సమంత, చైతన్య.. విడాకులు ఎందుకు తీసుకున్నారు.. అనే విషయం ఇప్పటి వరకు తమకు కూడా తెలియదని.. కానీ భవిష్యత్తులో బాగుండాలనే కోరుకుంటున్నానని.. సుమంత్ తెలిపారు.