Nalla Karam Podi : ఇడ్లీలను అల్పాహారంగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీలను చట్నీ, సాంబార్ తో పాటు కారం పొడితో కూడా తింటూ ఉంటాం. కారం పొడి, నెయ్యి తో కలిపి ఇడ్లీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తినే వారు కూడా మనలో చాలా మంది ఉన్నారు. ఈ ఇడ్లీ కారం పొడిని రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 15 లేదా తగినన్ని, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, చింతపండు – 5 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు.
ఇడ్లీ కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి ని వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మినపప్పును వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరివేపాకు, చింతపండు వేసి వేయించుకుని చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చి తో పాటు వేయించిన మిగిలిన దినుసులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కారాన్ని గాలి తగలకుండా గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ కారం తయారవుతుంది. దీనిని ఇడ్లీ, దోశలతో పాటు అన్నంలో నెయ్యి వేసుకుని కూడా తినవచ్చు. అన్నంతో కూడా ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది.