Nalla Karam Podi : మనం అనేక రకాల కారం పొడులను కూడా తయారు చేస్తూ ఉంటాము. టిఫిన్స్ తో పాటు అన్నంలో కూడా తినగలిగే రుచికరమైన కారం పొడులల్లో నల్లకారం పొడి కూడా ఒకటి. ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడి ఉంటే చాలు చట్నీలతో అవసరం లేకుండా టిఫిన్స్ ను తినవచ్చు. ఎవరైనా కూడా ఈ కారం పొడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ నల్లకారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లకారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 6 లేదా తగినన్ని, మినపప్పు – 2 టీ స్పూన్స్, కందిపప్పు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, చింతపండు – నిమ్మకాయంత, కరివేపాకు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్.
నల్లకారం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కందిపప్పు, మెంతులు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు కరకరలాడే వరకు వేగిన తరువాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్ని చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ కారం పొడిని గాజు సీసాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నల్లకారం పొడి తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి అల్పాహారాలతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యితో కూడా తినవచ్చు.