Nizam Style Fish Fry : నిజాం స్టైల్ చేపల ఫ్రై… నిజాంకాలంలో చేసిన ఈ చేపల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మసాలాలు బాగా పట్టించి చేసే ఈ చేపల ఫ్రైను సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. చేపలను తినని వారు కూడా ఈ ఫ్రై ను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ ఫ్రై ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ నిజాం స్టైల్ చేపలఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజాం స్టైల్ చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – పావు కప్పు, పచ్చిమిర్చి – 5, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క, నిమ్మకాయ – 1, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, చేప ముక్కలు – 7 నుండి 8.
నిజాం స్టైల్ చేపల ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, నిమ్మకాయ రసం, ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని అందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి దానిపై నూనెను వేసుకోవాలి. తరువాత చేప ముక్కలను ఉంచి నూనె వేసుకుంటూ వయించాలి.
ఈ చేప ముక్కలను చిన్న మంటపై 3 నుండి 4 నిమిషాలకొకసారి అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా చేపల ముక్కలను రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిజాం స్టైల్ చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని స్నాక్స్ గా లేదా సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చేపల ఫ్రైను డీప్ ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు. తరుచూ ఒకేరకంగా కాకుండా ఇలా వెరైటీగా మరింత రుచిగా కూడా ఈ చేపల ఫ్రైను తయారు చేసుకుని తినవచ్చు.