Mango : వేసవి కాలం సీజన్ వచ్చిందంటే చాలు.. మనకు అనేక రకాల మామిడి పండ్లు లభిస్తుంటాయి. కొందరు మామిడి రసాలను ఇష్టపడితే కొందరు కోత మామిడి అంటే ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన మామిడి అంటే ఇష్టం ఉంటుంది. ఇక రకాలను బట్టే ధరలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే పలు ప్రత్యేక వెరైటీలకు చెందిన మామిడి కాయలు కూడా మనకు లభిస్తుంటాయి. వాటిల్లో నూర్జహాన్ వెరైటీ మామిడి ఒకటి. ఇది బరువు అధికంగా ఉండడమే కాదు.. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. రుచి చాలా తియ్యగా ఉంటుంది. కనుకనే దీనికి రేటు అంత ఎక్కువగా ఉంటుంది.
ఆఫ్గనిస్థాన్‌లో పుట్టిన నూర్జహాన్ అనే మామిడి రకాన్ని మన దేశంలోనూ పలు ప్రాంతాల్లో పండిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కథివాడా అనే ప్రాంతంలో ఈ నూర్జహాన్ వెరైటీ మామిడిని పండిస్తున్నారు. కథివాడ ప్రాంతం అక్కడి అలిరాజ్‌పూర్ అనే జిల్లాలో ఉంది. అక్కడ శివరాజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఈ మామిడి కాయలను పండిస్తున్నాడు. ఇక వీటి ధర కూడా అధికంగానే ఉంటుంది. ఒక్కో మామిడి కాయ బరువు సుమారుగా 4 కిలోల వరకు ఉంటుంది. ఒక్కో కాయను రూ.1000 నుంచి రూ.2000 మధ్య విక్రయిస్తుంటారు.
సాధారణంగా ఈ కాయల చెట్లకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత వస్తుంది. జూన్ వరకు పూర్తిగా కాస్తాయి. అప్పుడే ఒక్కో కాయ బరువు 4 కిలోల వరకు తూగుతుంది. వీటిల్లోని విత్తనాల బరువే సుమారుగా 100 నుంచి 200 గ్రాముల మధ్య ఉంటుంది. ఇక ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు బాగా లేవని కనుక ఇప్పటికే కొన్ని చెట్లకు కాయలు రాలిపోయాయని దీంతో ఈసారి నష్టం తప్పేలా లేదని అంటున్నారు. ఈసారి ఒక్కో కాయను రూ.1000 నుంచి రూ.2000 మధ్య విక్రయిస్తామని చెబుతున్నారు. గతేడాది ఇవే కాయలు ఒక్కోటి రూ.500 నుంచి రూ.1000 మధ్య పలికాయి.
ఇక శివరాజ్ సింగ్ యాదవ్ తన తోటలో 250 చెట్లకు నూర్జహాన్ వెరైటీ మామిడి కాయలను పండిస్తున్నాడు. అయితే ఈ సారి పంట తక్కువగా వస్తుందని చెబుతున్నాడు. దీంతో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నాడు. ఈ సారి పంట జూన్ మొదటి వారం వరకు అందుబాటులోకి వస్తుందని.. ఇప్పటికే చాలా మంది ఈ కాయల కోసం ఆర్డర్ చేశారని తెలిపాడు. అయితే పూర్తి స్థాయిలో పంట చేతికి వస్తే కానీ ఏమీ చెప్పలేమని అంటున్నాడు.