Nuvvula Chikki : మన వంటింట్లో ఉండే దినుసుల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. నువ్వులను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, నొప్పులను, వాపులను తగ్గించడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో నువ్వులు మనకు ఎంతో సహాయపడతాయి. నువ్వులను వంటల్లో వాడడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే చిక్కీలను కూడా తయారు చేసుకోవచ్చు. నువ్వుల చిక్కీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చాలా తేలికగా చేసేలా రుచిగా నువ్వుల చిక్కీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల చిక్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, బెల్లం తరుము – ఒక కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్.
నువ్వుల చిక్కీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బెల్లం తురుము వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి ముదురుపాకం వచ్చే వరకు కలుపుతూ వేడి చేయాలి. బెల్లం పాకం గట్టిగా చెక్క లాగా అయిన తరువాత ఇందులో వంటసోడా వేసి కలపాలి. తరువాత నువ్వులు వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని స్విలర్ పాయిల్ వేసిన ప్లేట్ లోకి తీసుకుని సమానంగా చేసుకోవాలి. తరువాత రొట్ల కర్రకు నెయ్యి రాసి నువ్వుల మిశ్రమాన్ని చిక్కీలా వత్తుకోవాలి.
తరువాత కావాల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వుల మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల చిక్కీ తయారవుతుంది. దీనిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.