Oats Pakoda : మనం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో చేసే ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఓట్స్ తో రుచిగా, క్రిస్పీగా పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సాధారణ ఓట్స్ – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
ఓట్స్ పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఓట్స్ ను తీసుకోవాలి. తరువాత వీటిపై నీటిని చల్లుకుని కలుపుకోవాలి. ఓట్స్ తడిసిన తరువాత వాటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని చల్లుకుని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ పకోడి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.