Onion Bonda : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో బోండాలు కూడా ఒకటి. బోండాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచల్లో కూడా ఈ బోండాలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ బోండాలలో ఆనియన్ బోండా కూడా ఒకటి. ఉల్లిపాయలతో చేసే ఈ బోండాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఆనియన్ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), పెరుగు – అర కప్పు, మైదాపిండి – ముప్పావు కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వేడి నూనె – ఒక టేబుల్ స్పూన్.
ఆనియన్ బోండా తయారీ విధానం..
ముందుగా ఒక ప్లేట్ లో ఉల్లిపాయలను తీసుకుని వాటిని విడివిడిగా చేసి పక్కకు ఉంచాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప ముక్కలను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చిలకాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఆలూ పేస్ట్ వేసి కలపాలి. తరువాత మైదాపిండి, బియ్యం పిండి వేసుకోవాలి. పావు కప్పు వరకు నీటిని పోసుకుంటూ పిండిని బోండా పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె మధ్యస్థంగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసి వాటిలో ఉండే నీరు బయటకు రాకుండా నెమ్మదిగా కలపాలి. తరువాత వేడి నూనె కూడా వేసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ నూనెలో బోండాల లాగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ కదుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ బోండా తయారవుతాయి. బోండాలు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా చూసుకోవాలి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా వీటిని తీసుకోవచ్చు. వీటిని నేరుగా అలాగే తిన్నా లేదా చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.