Onion Chutney : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి మనకు ఎంతో కాలంగా ప్రాచుర్యంలో ఉంది. ఉల్లిపాయ మన శరీరానికి చేసే మేలు గురించి ఎంత చెప్పిన తక్కువే. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో వాపులను తగ్గించడంలో, జుట్టును ఆరోగ్యంగా చేయడంలో, శరీరంలో చెడు స్థాయిలను తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా ఉల్లిపాయ మనకు ఉపయోగపడుతుంది. వంటల్లో ఈ ఉల్లిపాయను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని సలుభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 3, ఎండుమిర్చి – 20 గ్రా., నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
ఆనియన్ చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత ధనియాలు, మెంతులు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత నానబెట్టిన చింతపండు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఈ ఉల్లిపాయ ముక్కలను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ చట్నీ తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు ఉదయం పూట చేసుకునే అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలతో తయారు చేసిన ఈ చట్నీని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.