Orange Cake : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో కేక్ ఒకటి. కేక్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కేక్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ కేక్ లభిస్తూ ఉంటుంది. మనకు బేకరీలల్లో ఎక్కువగా లభించే కేక్ వెరైటీలలో ఆరెంజ్ కేక్ కూడా ఒకటి. ఆరెంజ్ కేక్ ఆరెంజ్ ప్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది. ఈ కేక్ ను అచ్చం అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ కేక్ ను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, మైదాపిండి – 120 గ్రా., పంచదార పొడి – 120 గ్రా., ఆరెంజ్ జ్యూస్ – 40 ఎమ్ ఎల్, ఆరెంజ్ జెస్ట్ – అర టేబుల్ స్పూన్, నూనె – 30 ఎమ్ ఎల్, ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు, ఉప్పు – పావు టీ స్పూన్, ఆరెంజ్ ఎసెన్స్ – 5 చుక్కలు.
ఆరెంజ్ కేక్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను తీసుకోవాలి. తరువాత దీనిని బీటర్ తో ఒక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. తరువాత సగం పంచదార పొడిని వేసి మరో నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. తరువాత మిగిలిన పంచదార పొడిని వేసి క్రీమ్ లా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. తరువాత కోడిగుడ్డు పచ్చసొనను వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా మైదాపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ జెస్ట్, ఆయిల్, ఉప్పు, ఫడ్ కలర్, ఆరెంజ్ ఎసెన్స్ వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత కేక్ టిన్ లో బటర్ పేపర్ ను వేసుకోవాలి. తరువాత బుడగలు లేకుండా గిన్నెను తట్టాలి. ఇప్పుడు ఒవెన్ ను 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి.
తరువాత కేక్ టిన్ ను ఉంచి 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తరువాత ఈ కేక్ ను టిన్ నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ ను తీసేసి మనకు నచ్చిన ఆకారంలో కేక్ ను కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆరెంజ్ కేక్ తయారవుతుంది. ఈ కేక్ తయారీలో ఉపయోగించిన ఆరెంజ జెస్ట్ కోసం నారింజ తొక్క పై భాగాన్ని సన్నగా తురుముకుంటే సరిపోతుంది. ఈ ఆరెంజ్ కేక్ ను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. కేక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే కేక్ ను తయారు చేసుకుని తినవచ్చు.