Pakam Garelu : పాకం గారెలు.. బెల్లం, మినపప్పుతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. పాతకాలంలో చేసే తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. పాకం గారెలు చాలా రుచిగా ఉంటాయి. అసలు చాలా మందికి ఈ తీపి వంటకం గురించి కూడా తెలియదు అని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. పండగలకు, స్పెషల్ డేస్ లో ఇలా పాకం గారెలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పాకం గారెలను పాతకాలంలో తయారు చేసినట్టుగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాకం గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – 500 గ్రా., మిరియాల పొడి – అర టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, 4 గంటల పాటు నానబెట్టిన మినపప్పు – పావుకిలో, ఉప్పు – 2 చిటికెలు.
పాకం గారెల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బెల్లం, అరలీటర్ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దానిపై ఏర్పడిన తేటను తీసి వేయాలి. తరువాత ఈ బెల్లం నీటిని మరో 2 నుండి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత మినపప్పును గ్రైండర్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత చేతులకు తడి చేసుకుంటూ పిండిని తీసుకుని గారెలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని తీసుకోవాలి. తరువాత ఈ గారెలను ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసి అరగంట పాటు ఉంచాలి. తరువాత బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాకం గారెలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.