Healthy Corn Chaat : కార్న్ చాట్.. ఎండిన మొక్క గింజలతో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. తెలంగాణా వారు వీటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. తెలంగాణా స్టైల్ లో చెప్పాలంటే దీనిని మొక్క గుడాలు అంటారు. దాదాపు తెలంగాణాలో జరిగే ప్రతి ధావత్ లో ఈ గుడాలు ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. ఈ కార్న్ చాట్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ చాట్ ను తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే కార్న్ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండిన మొక్కగింజలు – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, ఉప్పు – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, దంచిన వెల్లుల్లి రెబ్బలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, నిమ్మరసం – అర చెక్క.
కార్న్ చాట్ తయారీ విధానం..
ముందుగా మక్కలను శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి నీళ్లు పోయాలి. తరువాత ఉప్పు, నూనె వేసి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ మక్కలను 9 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ గింజలను వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయించాలి. తరువాత ఉడికించిన గింజలు వేసి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ చాట్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.