Pala Payasam : పాల పాయసం.. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చిక్కగా ఉండే ఈ పాయసం చూడడానికి రబ్డి లాగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు 15 నిమిషాల్లో దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చాలా సులభంగా వారికి ఈ పాయసాన్ని తయారు చేసిపెట్టవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పాల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాల పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – అర లీటర్, పాలపొడి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – ఒక టీ స్పూన్, పంచదార – 5 టేబుల్ స్పూన్స్, కుంకుమ పువ్వు – చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
పాల పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో పాలపొడి, బియ్యంపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మిగిలిన పాలను పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పాలను పోసి కలపాలి. తరువాత కుంకుమ పువ్వు వేసి కలపాలి. కుంకుమ పువ్వుకు బదులుగా పసుపు లేదా ఫుడ్ కలర్ ను కూడా వేసుకోవచ్చు. దీనిని 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత దీనిని మరికొద్దిగా చిక్కబడే వరకు మరో 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాల పాయసం తయారవుతుంది. దీనిని వేడిగా తినవచ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత కూడా తినవచ్చు. ఈ విధంగా అప్పటికప్పుడు పాలతో రుచిగా పాలపాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.