Palak Pulka : పాలక్ పుల్కా.. పాలకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. మనం సాధారణంగా తయారు చేసే పుల్కాల కంటే ఈ పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా లేదా రాత్రి భోజనంలో తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల ఈ పుల్కాలు చాలా సమయం వరకు కూడా మెత్తగా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాలక్ పుల్కాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పుల్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 250 ఎమ్ ఎల్, తరిగిన పాలకూర – 200 గ్రా., అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 5, గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్.
పాలక్ పుల్కా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత ఇందులో పాలకూర వేసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన పాలకూరను జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్ చూర్ వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి.
తరువాత పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. తరువాత దీనిని వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కొద్దిగా రంగు మారే వరకు కాల్చుకోవాలి. తరువాత ఈ రోటీని పుల్కాల పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలక్ పుల్కా తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలకూరతో పుల్కాలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.