Palakura Rice : పాల‌కూర రైస్‌ను ఇలా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Palakura Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో ఈ వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోవ‌చ్చు. మ‌నం చేసుకోద‌గిన రైస్ వెరైటీస్ లో పాల‌కూర రైస్ కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాల‌కూర‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అలాగే అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా పాల‌కూర రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సులువుగా పాల‌కూర‌తో రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పాల‌కూర – 5 క‌ట్ట‌లు, అన్నం – 200 గ్రా., చిన్న‌గా త‌రిగిన బీన్స్ – అర క‌ప్పు, చిన్న‌గా తరిగిన క్యారెట్ – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1,త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌చ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Palakura Rice recipe in telugu make in this method
Palakura Rice

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకులు – 2 ( చిన్న‌వి), ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, సాజీరా – ఒక టీ స్పూన్, జాప‌త్రి – 1.

పాల‌కూర రైస్ త‌యారీ విధానం..

ముందుగా పాల‌కూర‌ను చిన్న ముక్క‌లుగా త‌ర‌గాలి. త‌రువాత దీనిని శుభ్రంగా క‌డిగి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ పట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యారెట్, బీన్స్, ప‌చ్చి బ‌ఠాణీ, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పాల‌కూర పేస్ట్, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించిన త‌రువాత అన్నాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి మ‌రో రెండు నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర రైస్ త‌యారవుతుంది. లంచ్ బాక్స్ లల్లోకి తిన‌డానికి ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. పాల‌కూర‌తో ఈ విధంగా చేసిన రైస్ ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts