Pepper Rice : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. కనుక మసాలా కూరల్లో వీటిని వేస్తుంటారు. చాలా మంది కారంకు బదులుగా మిరియాలను వాడుతుంటారు. ఎందుకంటే కారం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మిరియాలు అలా కాదు. ఎక్కువ తిన్నా ఏం కాదు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక చలికాలంలో అయితే మిరియాలను తప్పక తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే వీటిని నేరుగానే కాకుండా వంటల రూపంలోనూ తీసుకోవచ్చు.
ముఖ్యంగా మిరియాలతో చేసే చారు, రసం ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మిరియాలతో అన్నం కూడా తయారు చేయవచ్చు. ఇది కూడా రుచిగానే ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. మిరియాల రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు, నెయ్యి – రెండు టీస్పూన్లు, మిరియాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒకటిన్నర టీస్పూన్, ఎండు మిర్చి – 5, నూనె – ఒక టీస్పూన్, ఆవాలు – పావు టీస్పూన్, మినప పప్పు – ఒక టీస్పూన్, శనగపప్పు – ఒక టీస్పూన్, పల్లీలు – పావు కప్పు, పచ్చి మిర్చి – ఒకటి, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, జీడిపప్పు పలుకులు – పావు కప్పు.
మిరియాల రైస్‌ను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టీస్పూన్ నెయ్యి వేసి మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, మూడు ఎండు మిర్చి వేసి వేయించుకుని తీసుకోవాలి. వేడి పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద మళ్లీ కడాయి పెట్టి మిగిలిన నెయ్యి, నూనె వేయాలి. ఈ రెండూ వేడయ్యాక ఆవాలు, మిగిలిన జీలకర్ర, ఎండు మిర్చి, మినప పప్పు, శనగ పప్పు, ఇంగువ, జీడిపప్పు పలుకులు, పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు కూడా వేయాలి. అన్నీ వేగాక ముందుగా చేసుకున్న మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి ఆ తరువాత అన్నం వేసి కలిపి.. 5 నిమిషాలయ్యాక దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన మిరియాల అన్నం తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా కూరతోనూ కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.