Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో బూరెల‌ను ఇలా చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు..

Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు బూరెలు కూడా ఒక‌టి. ఈ పెస‌ర‌ప‌ప్పు బూరెలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌లో చాలా మంది వీటిని త‌యారు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా వీటిని చ‌క్క‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల పెస‌ర‌ప‌ప్పు బూరెలు రుచిగా, చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు నిల్వ కూడా ఉంటాయి. పెస‌ర‌ప‌ప్పు బూరెల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర‌ప‌ప్పు బూరెలు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – అర కిలో లేదా 2 గ్లాసులు, మిన‌ప‌గుళ్ల పొడి పిండి – 250 గ్రా. లేదా ఒక గ్లాస్, బియ్యం పిండి – అర కిలో, ఉప్పు – కొద్దిగా, పంచ‌దార – మూడున్న‌ర గ్లాసులు, నీళ్లు – 2 గ్లాసులు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై స‌రిప‌డా.

Pesarapappu Burelu Recipe in telugu very easy to make
Pesarapappu Burelu Recipe

పెస‌ర‌పప్పు బూరెలు త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర‌పప్పును శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో బియ్యం పిండి, మిన‌ప‌గుళ్ల పిండి, ఉప్పు వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి. ఈ పిండిని ఒక రాత్రంతా లేదా 8 గంట‌ల పాటు పులియ‌బెట్టాలి. త‌రువాత నాన‌బెట్టుకున్న పెస‌ర‌ప‌ప్పును మ‌రోసారి శుభ్రంగా క‌డిగి జార్ లోకి తీసుకోవాలి. ఈ పెస‌ర‌ప‌ప్పును నీళ్లు వేయ‌కుండా మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పెస‌ర‌పప్పు మిశ్ర‌మాన్ని ఇడ్లీ ప్లేట్ ల‌లో వేసి 15 నుండి 20 నిమిషాల పాటు ఇడ్లీల లాగా ఉడికించుకోవాలి.

త‌రువాత ఈ పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మాన్ని ప్లేట్ ల నుండి వేరు చేసి చిన్న ముక్క‌లుగా చేసి పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను జార్ లో వేసి 3 సెక‌న్ల పాటు మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. ఈ పంచ‌దార మిశ్ర‌మాన్ని ముదురు పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. పాకం వ‌చ్చిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మిక్సీ ప‌ట్టుకున్న పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మాన్ని వేసి ఉండ‌లు లేకుండా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత బియ్యంపిండి మిశ్ర‌మం ప‌లుచ‌గా ఉండేలా నీటిని పోసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె మ‌ధ్య‌స్థంగా వేడైన త‌రువాత పెస‌ర‌పప్పు ఉండ‌ల‌ను, బియ్యం పిండి మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బూరెల‌ను 30 సెక‌న్ల పాటు నూనెలో కాగిన త‌రువాత గంటెతో క‌దుపుకోవాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర‌ప‌ప్పు బూరెలు త‌యార‌వుతాయి. బియ్యంపిండి మిశ్ర‌మానికి బ‌దులుగా బాగా పులిసిన దోశ పిండి మిశ్ర‌మాన్ని కూడా బూరెల త‌యారీలో ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ బూరెల‌ను గాలి, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ బూరెలను అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts