Pesarapappu Halwa : పెసరపప్పుతో కూరలు, చిరుతిళ్లే కాకుండా తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పెసరపప్పు హల్వా కూడా ఒకటి. పెసరపప్పు హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. నైవేద్యంగా కూడా దీనిని సమర్పించవచ్చు. ఈ హల్వాను తయారు చేయడం చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. వంటరాని వారు కూడా సులభంగా ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ పెసరపప్పు హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – 200 గ్రా., పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, కుంకుమపువ్వు లేదా ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్.
పెసరపప్పు హల్వా తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో అర కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇందులోనే రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు వేయించిన తరువాత మరో అర కప్పు నెయ్యి వేసి కలపాలి.
ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని కలుపుతూ నెయ్యి వదిలే వరకు వేయించాలి. పెసరపప్పు మిశ్రమం చక్కగా వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమం వేసి కలపాలి. దీనిని మరో 2 నుండి 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు హల్వా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా పెసరపప్పుతో హల్వాను తయారు చేసి తీసుకోవచ్చు.