Pesarapappu Nimma Charu : మనం కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా కమ్మటి చారును తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే చారు చాలా కమ్మగా ఉంటుంది. చాలా మంది పెసరపప్పుతో కమ్మటి చారును తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ చారు తయారీలో చింతపండుకు బదులుగా మనం నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసి చేసే ఈ పెసరపప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నోటికి రుచిగా ఈ చారును తయారు చేసి తీసుకోవచ్చు. పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ పెసరపప్పు నిమ్మకాయ చారును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెత్తగా ఉడికించిన పెసరపప్పు – ఒక టీ గ్లాస్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 6, నెయ్యి – 2 టీ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – 2 లేదా 3 గ్లాసులు, ఉప్పు – తగినంత, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక పెద్ద నిమ్మకాయ.
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 4.
ముందుగా జార్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మిక్సీ పట్టుకున్న ధనియాల మిశ్రమం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉడికించిన పెసరపప్పు, నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు, టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. ఈ చారును 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత తాళింపుకు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని చారులో వేసి కలపాలి. ఈ చారు కొద్దిగా చల్లారిన తరువాత మన రుచికి తగినట్టు నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు నిమ్మచారు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెసరపప్పుతో కమ్మటి చారును తయారు చేసుకుని తినవచ్చు. ఈ చారును అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.