Sorakaya Saggubiyyam Payasam : సొరకాయ సగ్గుబియ్యం పాయసం… సొరకాయ, సగ్గుబియ్యం కలిపి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. సొరకాయతో తరుచూ కూరలే కాకుండా ఇలా పాయసాన్ని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. సొరకాయను తినని వారు కూడా ఈ పాయసాన్ని ఇష్టంగా తింటారు. ఎవరైనా చాలా తేలికగా ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ సొరకాయ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, బాదంపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, సొరకాయ తురుము – ఒక కప్పు, కాచి చల్లార్చిన చిక్కటి పాలు -అర లీటర్, నానబెట్టిన సగ్గుబియ్యం – అర కప్పు, పంచదార – అర కప్పు, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని అదే నెయ్యిలో సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. తరువాత సగ్గుబియ్యం వేసి కలపాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.