Pineapple Rava Kesari : మనం రవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రవ్వ కేసరి కూడా ఒకటి. రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ప్రసాదంగా కూడా దీనిని తయారు చేస్తూ ఉంటారు. ఈ రవ్వ కేసరిని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. పైనాపిల్ ముక్కలువేసి చేసే ఈ రవ్వ కేసరి మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. పైనాపిల్ ముక్కలు వేసి మరింత రుచిగా సులభంగా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు- 400 ఎమ్ ఎల్, పంచదార – ఒకటింపావు కప్పు, నెయ్యి – ఒక కప్పు, జీడిపప్పు – పిడికెడు, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ – 200 గ్రా., యాలకుల పొడి – ఒక టీ స్పూన్, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు – చిటికెడు, పైనాపిల్ ముక్కలు – 150 గ్రా..
పైనాపిల్ రవ్వ కేసరి తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. దీనిని చిన్న మంటపై కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. రవ్వను దోరగా వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పంచదార నీటిని పోసి కలపాలి. తరువాత కుంకుమ పువ్వు వేసి కలపాలి. రవ్వను మధ్యస్థ మంటపై దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత పైనాపిల్ ముక్కలు, యాలకుల పొడి వేసి కలపాలి.
తరువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గించిన తరువాత మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి నెయ్యి వేసి పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండగలకు ఇలా పైనాపిల్ తో రవ్వకేసరిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన రవ్వ కేసరిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.