Podi Pappu : దీన్ని అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలు.. రుచి అదుర్స్ అంటారు.. ఎలా చేయాలంటే..?

Podi Pappu : మ‌నం కందిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. కందిపప్పుతో చేసే ప‌ప్పు కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. కందిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పొడి ప‌ప్పు కూడా ఒక‌టి. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. పొడి ప‌ప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. రుచిగా, సుల‌భంగా పొడి ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పొడి ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన కందిప‌ప్పు – మూడు టీ గ్లాసులు, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా త‌గినంత‌.

Podi Pappu recipe in telugu very tasty how to make it
Podi Pappu

పొడి ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నాన‌బెట్టిన కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అందులో త‌గినంత నీళ్లు పోసి ప‌ప్పును ఉడికించాలి. ఈ ప‌ప్పును మ‌రీ మెత్త‌గా ఉడికించ‌కూడ‌దు. త‌రువాత పప్పులో ఉండే నీరు అంతా పోయేలా వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా వ‌డ‌క‌ట్టుకోగా వ‌చ్చిన నీటితో మ‌నం చారు, సాంబార్ వంటి వాటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ముందుగా ఉడికించుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిలో ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి.

ఈ ప‌ప్పును త‌డి అంతా పోయేలా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొడి ప‌ప్పు త‌యార‌వుతుంది. ఈ ప‌ప్పు వేడిగా ఉన్న‌ప్పుడు త‌డిగా ఉన్నా చ‌ల్లారే కొద్ది పొడిగా అవుతుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా కంది ప‌ప్పుతో పొడిప‌ప్పు కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ పొడి ప‌ప్పు కూర‌ను అన్నం, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts