Pomfret Fish Fry : పాంఫ్రేట్ ఫిష్.. మనం ఆహారంగా తీసుకోదగిన చేపలల్లో ఇది ఒక రకం. ఈ చేపలో ఒకే ఒక పెద్ద ముళ్లు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ఈ చేపలతో ఫ్రైను తయారు చేసుకుని తింటూ ఉంటారు. పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో ఇది లభిస్తుంది. స్టాటర్ గ తినడానికి, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేయవచ్చు. ఎప్పుడు చేసిన ఒకేవిధంగా, క్రిస్పీగా, రుచిగా పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్స్, శుభ్రం చేసిన పాంఫ్రేట్ చేపలు – అరకిలో, శనగపిండి – 2 టీ స్పూన్స్, బొంబాయి రవ్వ – అర కప్పు, నూనె – పావు కప్పు.
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కారం, నిమ్మరసం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. తరువాత పాంఫ్రేట్ చేపలకు రెండు వైపులా గాట్లు పెట్టుకోవాలి. తరువాత వీటికి మసాలా మిశ్రమాన్ని రెండు వైపులా అలాగే లోపల కూడా బాగా పట్టించాలి. తరువాత ఒక ప్లేట్ లో శనగపిండి, రవ్వ వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో చేపలను వేసుకుంటూ రెండు వైపులా బాగా పట్టించాలి. శనగపిండి మిశ్రమం చేపలకు బాగా పట్టించిన తరువాత గ్రిల్ కళాయి లేదా సాధారణ కళాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత చేపలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై 7 నిమిషాల పాటు వేయించిన తరువాత పై భాగంలో మరొ కొద్దిగా నూనె రాసి మరో వైపుకు తిప్పాలి. ఇలా అంచుల వెంబడి నూనె రాస్తూ చేపలను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇవి చక్కగా వేగడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. చేపలను రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అలాగే పప్పుచారు, మిరియాల చారు వంటి వాటితో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.