Potato Fry : మనం ఎక్కువగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బంగాళాదుంపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒకటి. బంగాళాదుంప వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
అయితే కొందరూ ఎన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ బంగాళాదుంప వేపుడును కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోలేకపోతుంటారు. బంగాళాదుంప ముక్కలు ముద్దగా అవ్వడం, కళాయికి అతుక్కుపోవడం వంటివి జరుగుతాయి. ఈ బంగాళాదుంప వేపుడును కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – 5 ( మధ్యస్ఠంగా ఉన్నవి), నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్.
బంగాళాదుంప వేపుడు తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంప ముక్కలను ఉప్పు వేసిన నీటిలో వేసి రెండు సార్లు బాగా కడగాలి. తరువాత ఈ ముక్కలను నీటి నుండి తీసి జల్లి గిన్నెలో వేసి నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత వెడల్పుగా ఉన్న కళాయిని తీసుకుని అందులో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత నీళ్లు లేకుండా చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఈ ముక్కలను మధ్యస్థ మంటపై అడుగు భాగం మాడకుండా కలుపుతూ కరకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత కళాయిలో ముక్కలను పక్కన పెట్టి ఎక్కువగా ఉన్న నూనెను తీసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల వేపుడు ఎక్కువగా నూనె లేకుండా ఉంటుంది. తరువాత ముక్కలను మరో 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ వేపుడును మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ రుచిగా ఉండే బంగాళాదుంప వేపుడు తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల నాన్ స్టిక్ కళాయిలో చేయకపోయినా కూడా బంగాళాదుంప వేపుడు అడుగు భాగం మాడకుండా ముద్దగా అవ్వకుండా కరకరలాడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసిన బంగాళాదుంప వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.