Prawns Pulao : మనం రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల పులావ్ కూడా ఒకటి. రొయ్యల పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రొయ్యల పులావ్ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం పడుతుందని అలాగే ఎక్కువగా శ్రమించాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా మనం రొయ్యల పులావ్ ను తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సులభంగా రొయ్యల పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, పసుపు – అర టీ స్పూన్, రొయ్యలు – పావు కిలో, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, అన్నం – ఒక కప్పు బాస్మతీ బియ్యంతో వండినంత, నెయ్యి- ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
రొయ్యల పులావ్ తయారీ విధానం..
ముందుగా బాస్మతీ బియ్యంలో ఉప్పు వేసి అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపు, రొయ్యలు వేసి కలపాలి. ఈ రొయ్యల్లో ఉండే నీరంతా పోయి నూనె పైకి తేలేటప్పుడు వీటిని తీసి ప్లేట్ లోకి వేసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే కారం, ఉప్పు, గరం మసాలా వేసి వేయించాలి.
తరువాత వేయించిన రొయ్యలు వేసి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత అన్నం వేసి కలపాలి. మసాలాలన్నీ అన్నాన్నికి పట్టిన తరువాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల పులావ్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వంటరాని వారు కూడా ఈ విధంగా రొయ్యల పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు.