Prawns Tomato Curry : రొయ్యలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ప్రియులకు వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల కూర కూడా ఒకటి. టమాటాలు వేసి చేసే ఈ రొయ్యల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే రొయ్యల కూరను చాలా సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – అరకిలో, తరిగిన టమాటాలు – 3, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్.
రొయ్యల కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రొయ్యలను వేసి వేయించాలి. రొయ్యల్లోని నీరంతా పోయే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసప పోయే వరకు వేయించిన తరువాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి.
తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత వేయించిన రొయ్యలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి కలిపి మరో 5 నిమిషాల పాటుఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా రుచిగా చాలా సులభంగా రొయ్యలతో ఎవరైనా కూరను తయారు చేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.