Protein Laddu : ప్రోటీన్ లడ్డూ.. కింద చెప్పిన విధంగా చేసే ఈ ప్రోటీన్ లడ్డూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఈ లడ్డూను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఈ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ ప్రోటీన్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టీ స్పూన్స్, రాగిపిండి – ఒక కప్పు, పల్లీలు – పావు కప్పు, ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, బెల్లం – ముప్పావు కప్పు, నీళ్లు – పావు కప్పు.
ప్రోటీన్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఇందులో రాగిపిండి వేసి చిన్న మంటపై 9 నుండి 10 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పల్లీలు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి. ఈ పల్లీలను బరకగా మిక్సీ పట్టుకుని రాగిపిండిలో వేసి కలపాలి. తరువాత ఉప్పు, యాలకుల పొడి కూడా వేసి కలిపి పక్కకు ఉంచాలి.
తరువాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి లేత తీగపాకం వచ్చిన తరువాత దీనిని వడకట్టి రాగిపిండిలో వేసుకోవాలి. దీనిని స్పూన్ తో అంతా కలిసేలా కలుపుకున్న తరువాత గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రోటీన్ లడ్డూ తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలకు వీటిని రోజుకు ఒకటి చొప్పున ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.