Shanagala Fry : మనం కాబూలీ శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబూలీ శనగలతో చేసిన వంటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే తరుచూ కూరలే కాకుండా కాబూలీ శనగలతో మనం ఫ్రై శనగలను కూడా తయారు చేసుకోవచ్చు. మహారాష్ట్ర వంటకమైన ఈ చనా ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ శనగల ఫ్రైను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాబూలీ శనగలతో శనగల ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
కాబూలీ శనగలు – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, శనగపిండి – 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు సరిపడా, పొట్టుతో దంచిన వెల్లుల్లి రెబ్బలు – 8.
శనగల ఫ్రై తయారీ విధానం..
ముందుగా గిన్నెలో శనగలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు, వంటసోడా వేసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని మరోసారి శుభ్రంగా కడిగి కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత శనగలను పూర్తిగా వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. అవసరమైతే ఒక టీ స్పూన్ నీటిని వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కాబూలీ శనగలతో చేసే ఈ ప్రై చనా ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.