మనం కోడిగుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో ప్రోటీన్స్ తో పాటు ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. నిపుణులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోమని సూచిస్తూ ఉంటారు. పిల్లలకు రోజూ గుడ్డును ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. కోడిగుడ్లను తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. గుండెకు, చర్మానికి, జుట్టు, ఎముకలకు గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. గుడ్డును తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. ఈ విధంగా గుడ్డును తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అయితే కొందరు గుడ్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వాడుకుంటారు.
కొందరు మాత్రం గుడ్లను ఒకేసారి కొనుగోలు చేసి ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు. కానీ గుడ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లపై సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఇతర ఆహార పదార్థాలపై కూడా వ్యాపిస్తుంది. కనుక కోడిగుడ్లను బయటే ఉంచి నిల్వ చేయాలి. కొన్ని చిట్కాలను వాడడం వల్ల మనం కోడిగుడ్లను బయట ఉంచినప్పటికి ఎక్కువకాలం పాటు తాజాగా ఉంటాయి. కోడిగుడ్లను ఎక్కువ కాలం పాటు తాజా ఉంచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు సాధారణంగా ఒక వైపు వెడల్పుగా మరో వైపు కొద్దిగా తక్కువ వెడల్పుతో ఉంటాయి. వీటిని నిల్వ చేసేటప్పుడు తక్కువ వెడల్పుగా ఉండే భాగం కిందికి వచ్చేలా చూసుకోవాలి.
వాటిని ఎక్కువగా కదిలించకూడదు. ఇలా నిల్వ చేయడం వల్ల కోడిగుడ్లు ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. అలాగే కోడిగుడ్లపై మనం వంటకు వాడే నూనెను రాయాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్లు 10 నుండి 12 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇక ఒక్కో కోడిగుడ్డను టిష్యూ పేపర్ లో చుట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కోడిగుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా గుడ్లను ఎక్కువ కాలం పాటు బయటే ఉంచి నిల్వ చేసుకోవచ్చు.