Protein Rich Laddu : మనకు సులభంగా లభించే పదార్థాలతో చాలా సులభంగా లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి. ఈ లడ్డూలను తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యతో బాధపడే వారు ఈ లడ్డూలను తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. రుచిగా, కమ్మగా, చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – అర కప్పు, అవిసె గింజలు – ఒక కప్పు, బాదం పప్పు – అర కప్పు, బెల్లం – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, యాలకుల పొడి -ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్.
హెల్తీ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో అవిసె గింజలు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే బాదంపప్పు కూడా వేయించాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించిన బాదంపప్పును తీసుకుని బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నువ్వులు, అవిసె గింజలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి కళాయిలోకి తీసుకోవాలి. ఈ బెల్లం మిశ్రమంలో యాలకుల పొడి వేసి కలిపి లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడులను వేసి బాగా కలుపుకోవాలి. అలాగే నెయ్యి వేసి కలుపుకోవాలి.
తరువాత దీనిని దగ్గర పడే వరకు బాగా ఉడికించాలి. కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. ఈ మిశ్రమం ఉండ చేయడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు ఒక లడ్డూను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.