Pudina Pachadi : మనం వంటల్లో పుదీనాను విరివిగా వాడుతూ ఉంటాము. పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో వాడడంతో పాటు పుదీనాతో పుదీనా రైస్, పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. పుదీనా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు వేసి చేసే ఈ పుదీనా పచ్చడిని ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు. అలాగే ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కూడా కలుగుతుంది. పుదీనాతో కమ్మగా, నోటికి రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా ఆకులు – 3 కప్పులు, నువ్వులు – 1/3 కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10 నుండి 15, తరిగిన టమాటాలు – 2, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఇంగువ – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
పుదీనా పచ్చడి తయారీ విధానం..
ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నువ్వులు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పుదీనా ఆకులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన నువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, వేయించిన టమాట ముక్కలు, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపు పదార్థాలతో తాళింపు చేసి పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.