Thalakaya Kura : మాంసాహార ప్రియులకు తలకాయ కూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తలకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, సంగటి, చపాతీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కో రకంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే తలకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు కింద చెప్పిన విధంగా చేయడం వల్ల కమ్మటి తలకాయ కూరను తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా తలకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తలకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తలకాయ కూర – ఒకకిలో, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక టీ గ్లాస్, నూనె – 2 టీ స్పూన్స్, ఉల్లిపాయలు – 4, ఎండుకొబ్బరి ముక్క – 1, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 4 టీ స్పూన్స్ లేదా తగినంత, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, జాపత్రి – కొద్దిగా, అనాస పువ్వు – 1.
తలకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా తలకాయ కూరను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని కుక్కర్ లో వేసి, నీళ్లు, నూనె, పసుపు వేసి మూత పెట్టాలి. ఈ కూరను 50 శాతం మెత్తగా అయ్యే వరకు ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఉల్లిపాయలను గుత్తి వంకాయ మాదిరి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని మంటపై మెత్తగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత ఎండుకొబ్బరి ముక్కను కూడా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయలను, కొబ్బరిని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉడికించిన తలకాయ కూర వేసి కలపాలి. తరువాత కారం, ఉప్పు, మసాలా పొడి, పసుపు వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత 3 గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కూర ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తలకాయ కర్రీ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన తలకాయ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.