Punjabi Chicken Gravy : పంజాబి చికెన్ గ్రేవీ కర్రీ.. పంజాబి స్టైల్ లో చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, అన్నం, దోశ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కోరుకునే వారు తప్పకుండా ఈ చికెన్ కర్రీని రుచి చూడాల్సిందే. మొదటిసారి చేసే వారు కూడా ఈ చికెన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పంజాబి చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబి చికెన్ గ్రేవీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 3 టీ స్పూన్స్, సాజీరా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చికెన్ – 650 గ్రా., నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4, మిరియాలు – 20, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, తరిగిన పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 2, బిర్యానీ ఆకు – 1, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – పెద్దవి రెండు, తరిగిన టమాటాలు – పెద్దవి రెండు.
పంజాబి చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం..
ముందుగా మసాలా పేస్ట్ తయారీ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత సాజీరా వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి వేయించాలి. ఇందులోనే ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
తరువాత చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చికెన్ లోని నీరంతా పోయే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పంజాబి చికెన్ గ్రేవీ కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ విధంగా తయారు చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది.