Punjabi Lassi : పంజాబీ లస్సీ.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ లస్సీ చల్ల చల్లగా తాగే కొద్ది తాగాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఎక్కువగా వేసవిలో ఇది మనకు లభిస్తుంది. ఎక్కువగా పంజాబీ ధాబాల్లో లభిస్తుంది. ఈ లస్సీ ఒక గ్లాస్ తాగితే చాలు కడుపు నిండి పోతుంది. ఈ లస్సీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే పంజాబీ లస్సీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబి లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కమ్మటి చిక్కటి మీగడ పెరుగు – 400 ఎమ్ ఎల్, పంచదార – పావు కప్పు, చల్లటి నీళ్లు – అర కప్పు, పాలకోవా – ఒక టేబుల్ స్పూన్, పిస్తా తరుగు – అర టీ స్పూన్.
పంజాబి లస్సీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో కమ్మటి చిక్కటి మీగడ పెరుగును వేసి బ్లెండ్ చేసుకోవాలి. దీనిని 3 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. తరువాత పంచదార వేసి మరలా బ్లెండ్ చేసుకోవాలి. పంచదార కరిగిన తరువాత చల్లటి నీళ్లు పోసి మరలా 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఈ లస్సీని గ్లాస్ లో పోసి పైన కోవా, పిస్తా తరుగు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పంజాబి లస్సీ తయారవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చల్లటి కమ్మటి లస్సీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.