Puttu Macha : ప్రతి మనిషికి వారి వారి భవిష్యత్తు తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. దీని కోసం ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు ఒక పద్దతిని ఉపయోగిస్తున్నారు. వీటిలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఒకటి. మన శరీర భాగాలపై ఉండే పుట్టు మచ్చల స్థానాన్ని బట్టివారి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం దీని ప్రత్యేకత. పుట్టుకతో వచ్చిన వాటిని పుట్టు మచ్చలు అంటారు. వీటిని మనిషిని గుర్తించడానికి కూడా ఉపయోగిస్తారు. పుట్టు మచ్చల శుభ, అశుభ ఫలితాలు స్త్రీ, పురుషులకు వేరు వేరుగా ఉంటాయి. పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం వాటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషులకు తలపైన పుట్టు మచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానిని నిశితంగా పరిశీలిస్తారు. వీరికి మంచి ప్రతిభ ఉంటుంది. అలాగే నుదుటి మీద పుట్టు మచ్చ ఉంటే సమాజంలో గౌరవం లభిస్తుంది. నుదుటి మీద పుట్టుమచ్చ ఉన్న వారు రాజకీయాలలో ఎక్కువగా రాణిస్తారు. నుదుటి కింద పుట్టుమచ్చ ఉంటే ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. రెండు కనుబొమ్మల మధ్య ఉంటే దీర్ఘాయుషులై ఉంటారు. పుట్టు మచ్చ కనుక కుడి కనుబొమ్మ మీద ఉంటే వివాహం తరువాత ధనం కలసి వస్తుంది. వారి దాంపత్యం కూడా సాఫీగా సాగుతుంది. ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు క్రమశిక్షణ ఉండదు. రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులు అవడంతోపాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు.
పెదవుల మీద పుట్టు మచ్చ ఉన్న వారికి కొంచెం ఈర్ష్యాభావం ఉంటుంది. అలాగే వీరు చమత్కారంగా మాట్లాడగలరు. అదే విధంగా నాలుక మీద పుట్టు మచ్చ ఉన్న వారు మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు. బుగ్గ మీద ఉన్న వారు రాజకీయాలలో మంచిగా రాణించగలరు. పురుషులు గడ్డంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలి గుణాన్ని కలిగి ఉంటారు. మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది. భుజం మీద పుట్టుమచ్చ ఉన్న వారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. పొట్ట మీద పుట్టు మచ్చ ఉన్న వారు ఎక్కువగా భోజనం చేస్తారు. పొట్ట కింద పుట్టుమచ్చ కలిగిన వారికి కష్టాలు ఎదురవుతాయి.
పుట్టుమచ్చ నాభి లోపల ఉన్న వారికి ధన లాభం కలుగుతుంది. ఎడమ తొడపై పుట్టు మచ్చ ఉన్న వారికి శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కుడి తొడ మీద పుట్టు మచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో ఆలసత్వం కలిగి ఉంటారు. పాదాలపై పుట్టు మచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.