Radish Chutney : ముల్లంగి అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Radish Chutney : ముల్లంగిని.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి. అయితే చాలా మంది దీని రుచి, వాస‌న కార‌ణంగా దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక విధాలుగా ముల్లంగి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ ముల్లంగితో మ‌నం కూర‌ల‌తో పాటు ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ముల్లంగితో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంట్లో అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తినేలా ముల్లంగి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్లంగి ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ముల్లంగి – 400 గ్రాములు, నూనె – 1/3 క‌ప్పు, పెటల్స్ లాగా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌సుపు – పావు టీ స్పూన్, చింత‌పండు – 100 గ్రా., ఎండుమిర్చి – 50 గ్రా., ధ‌నియాలు – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Radish Chutney recipe in telugu very tasty with rice
Radish Chutney

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు.

ముల్లంగి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ముల్లంగిపై ఉండే చెక్కును తీసేసి వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముల్లంగి ముక్క‌ల‌ను వేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఇందులో ఉల్లిపాయ‌, అల్లం ముక్క‌లు, ప‌సుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గానికి పైగా వేగిన త‌రువాత చింత‌పండు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో 5 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో పావు క‌ప్పు నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, అర టీ స్పూన్ ప‌సుపు వేసి వేయించాలి.

త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, వేయించిన ముల్లంగి ముక్క‌లు వేసి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముల్లంగి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డి వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. ముల్లంగిని ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు.

D

Recent Posts